రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని సీఎస్ గా నియమించడంపై రాహుల్ గాంధీ ఫైర్

  • మనోజ్ అగర్వాల్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించిన సువేందు ప్రభుత్వం
  • దీన్ని 'బీజేపీ-ఈసీ చోర్ బజార్'గా అభివర్ణించిన రాహుల్
  • ఎన్నికల సంఘం, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపణ

పశ్చిమ బెంగాల్‌లో సువేందు అధికారి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చిచ్చు రేపింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా పనిచేసిన మనోజ్ అగర్వాల్‌ను, ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) వంటి అత్యున్నత పదవిలో నియమించడం తీవ్ర దుమారానికి దారితీసింది.


ఈ నియామకాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. దీనిని 'బీజేపీ-ఈసీ చోర్ బజార్' గా అభివర్ణిస్తూ ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్ చేశారు. ఎన్నికల సంఘం, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించిన ఆయన.. "దొంగతనం ఎంత పెద్దదైతే, దానికి లభించే ప్రతిఫలం కూడా అంత పెద్దదిగా ఉంటుంది" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన వ్యక్తికి ఇలాంటి కీలక పదవి ఇవ్వడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు.


మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ నేతలు కూడా ఈ చర్యపై నిప్పులు చెరుగుతున్నారు. బెంగాల్ ఎన్నికలను బీజేపీ, ఈసీ కలిసి దొంగిలించాయని, అందుకు ఈ నియామకమే నిదర్శనమని మండిపడుతున్నారు. ఎన్నికల పారదర్శకతపై నీడలు కమ్ముకున్నాయని టీఎంసీ విమర్శిస్తోంది. అయితే, ఈ విమర్శలను బీజేపీ గట్టిగా తిప్పికొడుతోంది. గతంలో మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా తనకు నచ్చిన బ్యూరోక్రాట్లకు పదవులు ఇచ్చి వ్యవస్థను భ్రష్టు పట్టించిందని, మనోజ్ అగర్వాల్ నియామకం కేవలం మెరిట్ (అర్హత) ఆధారంగానే జరిగిందని సమర్థించుకుంటోంది.


Rahul Gandhi
West Bengal
Manoj Agarwal
Chief Secretary
Election Commission
Suvendu Adhikari
BJP
TMC
Indian Politics
Election Rigging

More Telugu News